పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : బండి సంజయ్ - స్వామివివేకానందకు బండి నివాళులు
Published : Jan 12, 2024, 7:44 PM IST
Bandi Sanjay Speech on Swamy Vivekananda : భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఎంపీ బండి సంజయ్ కొనియాడారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో నేటి యువత అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనించాలని కోరారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కితాబిచ్చారు. ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఘనత మోదీదేనన్నారు. జాతీయ యువ జన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానందకు పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. శివ థియేటర్ సమీపంలో జరిగిన కార్యకమంలో పాల్గొన్న బండి సంజయ్ యువతీ యువకులకు యువ సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు.
Bandi Sanjay Fires on Congress :అయోధ్యలో రాముడి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం సిగ్గు చేటని మంత్రి సంజయ్ మండిపడ్డారు. రామమందిర నిర్మాణానికి వ్యతిరేకమా, లేక అనుకులమా కాంగ్రెస్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీదును నిర్మిస్తే కాంగ్రెస్ నేతలు వెళ్లేవారేమోనని ఎద్దేవా చేశారు. ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని, ఒవైసీకి కోపం వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ బహిష్కరించిందని ఆయన ఆరోపించారు. శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించినప్పుడే కాంగ్రెస్ వైఖరి అర్థమైందన్నారు. పోటాపోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్ను కాపాడుకునేందుకు ఒవైసీతో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.