బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే వర్గం కోసం పనిచేస్తున్నాయి : బండి సంజయ్ - కేసీఆర్ కేటీఆర్‌పై బండి విమర్శలు
Published : Nov 16, 2023, 4:56 PM IST
Bandi Sanjay Slams KCR And KCR : రాష్ట్రంలో ఓట్ల కోసం కేసీఆర్, కేటీఆర్ దేనికైనా దిగజారతారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ప్రచారానికి బండి హెలిప్యాడ్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలో వినాయక చవితి, దసరా ఉత్సవాలు జరుపుకోవాలంటే పోలీసుల నుంచి అన్ని శాఖల అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటోందని మండిపడ్డారు.
ఎన్నికలు వస్తే తండ్రి కుమారులు హద్దు అదుపు లేకుండా మాట్లాడతారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు నాశనం చేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని అల్లాతో సమానంగా ఎలా అనుకుంటున్నారోనని ప్రశ్నించారు. అవకాశం వస్తే బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపించారు. ఆయనకు అవసరం వస్తే రామాయణాన్ని కూడా మారుస్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకే వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.