Bandi sanjay: అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లు.. ముఖ్యమంత్రేమో దిల్లీకి టూర్లు - Telangana Latest Agriculture News
Bandi sanjay on Crop Damage in Telangana : అకాల వర్షంతో పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటనలు చేస్తున్నారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇది వరకు ప్రకటించిన పదివేల రూపాయాలు సరిపోవని అన్నారు. రాష్ట్రప్రభుత్వం తక్షణం ఎకరాకు 30 వేల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, నాగంపేట గ్రామాల్లో వడగండ్ల వానలతో నష్టపోయిన పొలాలను పరిశీలించారు. రైతులను నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో లక్షా 70వేల ఎకరాల్లో సగానికిపైగా నష్టం జరిగితే.. కేవలం 17 వేల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు ప్రభుత్వ అధికారులు లెక్కలు చూపారని తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా నష్టం అంచనాలు వేస్తున్నారని విమర్శించారు. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.