కేసీఆర్ వస్తే సన్మానిద్దామని శాలువా కూడా తెచ్చా.. కానీ రాలే: బండి సంజయ్ - narendra modi telangana tour
తెలంగాణ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమానికి కేసీఆర్ వస్తే.. సత్కరించేందుకు శాలువా కూడా తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రధానమంత్రి కార్యక్రమానికి సీఎం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి నిరోధకంగా మారారనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను మోదీ సభకు రమ్మని ఆహ్వానించామని బండి సంజయ్ శుక్రవారం పేర్కొన్నారు. సీఎం సభకు వస్తే ప్రధానితో సన్మానం చేయిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన వస్తే సత్కరించేందుకు తాను శాలువా కూడా తీసుకువచ్చానని చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మోదీ సభను విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలతో పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.