కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు : బండి సంజయ్ - Sanjay on Kaleswaram
Published : Jan 11, 2024, 12:32 PM IST
Bandi Sanjay Fires on Congress : రాష్ట్రంలో యువతను మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. విద్యా సంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. మద్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ.40,000ల కోట్లు ఆర్జిస్తోందని తెలిపారు. మరోవైపు కాళేశ్వరంపై రాష్ట్ర సర్కార్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్ విచారణ అంటున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని బండి సంజయ్ గుర్తు చేశారు. రాష్ట్రం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని, పవిత్ర కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదని హితవు పలికారు. స్వామి వివేకానంద చరిత్ర, ఆశయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. వివేకానందుడి స్పూర్తితో పని చేస్తున్న ప్రధాని మోదీ, భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.