కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్రయత్నాలు - లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు : బండి సంజయ్ - కాంగ్రెస్‌పై బండిసంజయ్ ఫైర్
Published : Jan 14, 2024, 4:49 PM IST
Bandi Sanjay Fires on BRS and Congress : కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడవచ్చంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులు మాజీ సీఎంకు టచ్‌లో ఉన్నారంటూ ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చన్నారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచింది బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పోరాటం తర్వాత చేద్దామని, ముందు బీఆర్ఎస్ పని పట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. తెలంగాణలో అన్ని విధాలా అభివృద్ధి జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా బీజేపీ ఎంపీలను గెలిపించారని కోరారు. కాంగ్రెస్ నాయకలు అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్టకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.