రాష్ట్రంలో ప్రారంభమైన బ్యాలెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ - 299 అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతి - కొత్త పోలింగ్ స్టేషన్లపై డిప్యూటీ సీఈఓ సత్యవాణి
Published : Nov 17, 2023, 9:04 PM IST
|Updated : Nov 17, 2023, 9:32 PM IST
Ballot Paper Printing Process Started in Telangana : శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడంతో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 7ఏలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు. అందుకు అనుగుణంగా చంచల్గూడా ప్రభుత్వ ముద్రణాలయంలో బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైందని వివరించారు. నిర్ధేశిత గడువులోగా బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేయాలని.. 18వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్ల ముద్రణ పూర్తి కావాలని సీఈవో వికాస్‌రాజ్ ఆదేశించినట్లు తెలిపారు.
పెరిగిన ఓటర్లకు అనుగుణంగా 299 అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతి ఇచ్చిందని.. దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కు చేరుకుందని సత్యవాణి చెప్పారు. ప్రతి జిల్లాకు ఓట్ల లెక్కింపు కేంద్రం కౌంటింగ్ సెంటర్‌కు కూడా ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల ఆమోదం, తిరస్కరణకు సంబంధించి ఆర్ఓలపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో ఈసీ సహా ఎవరూ చేసేదేమీ లేదని వివరించారు. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్‌కు సంబంధించి షెడ్యూల్ ఇచ్చి వారి ఇంటి దగ్గరే ఓటు నమోదు చేయించనున్నట్లు డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు.