Balkampet Yellamma Kalyanam : కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
Balkampet Yellamma Kalyanam in Hyderabad : హైదరాబాద్ బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా.. ఆషాఢ మాసం మొదటి మంగళవారంలో జరిగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నరకు అమ్మవారి కల్యాణ వేడుక ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అలానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావటంతో.. ఆలయ ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల రాక కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుక సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. భారీగా బందోబస్తును సిద్ధం చేశారు. ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా నిన్న ఎదుర్కోళ్లు నిర్వహించగా... ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం సాగింది. రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత సేపు తోపులాట జరిగింది. వీఐపీ పాస్లు ఎక్కువ ఇవ్వడం వల్లే రద్దీ పెరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు.