Balakrishna on CBN Gratitude Concert Program: "హైదరాబాద్‌లో సీబీఎన్‌కు తిరుగులేని మద్దతునిచ్చారు.. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు " - Chandrababu Hyderabad Program
Published : Oct 31, 2023, 9:37 AM IST
|Updated : Oct 31, 2023, 10:47 AM IST
Balakrishna on CBN Gratitude Concert Program: హైదరాబాద్‌లో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమంలో.. చంద్రబాబుకు మద్దతుగా హాజరైన ప్రతి ఒక్కరికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ, బ్రహ్మణి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం చంద్రబాబుకు తిరుగులేని మద్దతునిచ్చిందని.. అభిమానులు చూపిన, ప్రేమ గౌరవం తమను కదిలించిందని చెప్పారు. నగరాభివృద్ధిలో చంద్రబాబు ప్రజలపై చూపిన ప్రేమను గుర్తుచేసిందన్నారు. 'సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్' కేవలం కృతజ్ఞతా కార్యక్రమం మాత్రమే కాదని.. సవాలు ఎదుర్కొనే సమయంలో ఇది సంఘీభావానికి చిహ్నంగా కూడా ఉందని వెల్లడించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు రాజకీయ ప్రేరేపితమని అంతా దృఢంగా విశ్వసిస్తున్నారన్నారు. అనుకోని కార్యక్రమం కారణంగా తాను హాజరు కాలేకపోయినప్పటికీ, క్లిష్ట సమయంలో చంద్రబాబుపై వారికున్న నమ్మకానికి, ఆయనతో పాటు నిలబడాలనే నిబద్ధతకు వారి మద్దతు నిదర్శనమని తెలిపారు. అందరి మద్దతు తమకు బలాన్ని అందిస్తుందని.. చంద్రబాబు అక్రమ కేసులు సవాళ్ల నుంచి కడిగిన ముత్యంలా బయటకురావాలన్న తమ సంకల్పాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు.