బావిలో పడ్డ ఏనుగు పిల్ల.. రాత్రంతా నరకయాతన.. చివరకు..
ఓ ఏనుగు పిల్ల ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు పురాతన బావిలో పడింది. తల్లి ఏనుగు సైతం అక్కడే ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగింది. ఫలితంగా ఏనుగు పిల్ల రాత్రంతా బావిలోనే నరకయాతన అనుభవించింది. సోమవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభించిన అటవీ అధికారులు.. ఎట్టకేలకు ఏనుగు పిల్లను బయటకు తీశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి ఏనుగు పిల్లను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్పుర్లో జరిగింది.
ఇదీ జరిగింది
జుజుముర పోలీస్ స్టేషన్ పరిధిలోని బసియాపడ అటవీ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ ఏనుగు పిల్ల అక్కడే ఉన్న ఓ పురాతన బావిలో పడిపోయింది. దీంతో బావి నుంచి బయటకు రాలేక.. గట్టిగా అరిచింది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులకు ఓ ఇబ్బంది ఎదురైంది. తల్లి ఏనుగు అక్కడే ఉండి, అడ్డుకోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగలేదు. దీంతో చేసేదేమీ లేక ఆటవీ అధికారులు కాస్త వెనక్కి తగ్గారు. తిరిగి సోమవారం ఉదయం తల్లి ఏనుగు వెళ్లాక సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులకు వర్షం రూపంలో మరో ఆటంకం కలిగింది. సుమారు 3 గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు.. ఏనుగు పిల్లను సురక్షితంగా బయటకు తీశారు. పైకి వచ్చిన ఏనుగు పిల్ల కాసేపు గందరగోళం సృష్టించింది. బావిపై గుమికూడిన ప్రజలపైకి వెళ్లింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు.