Babu Mohan Clarity on Assembly Elections Contest : 'పార్టీలో చాలా అవమానాలు జరిగాయి.. ఈసారి ఎన్నికల పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా' - Telangana Latest Political News
Published : Oct 28, 2023, 4:38 PM IST
Babu Mohan Clarity on Assembly Elections Contest :ఈఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు బీజేపీ సీనియర్ నేత బాబుమోహన్ తెలిపారు. తనకు తొలి జాబితాలో టిక్కెట్ ఇవ్వకపోవడం.. బీజేపీ నాయకుల తీరుపై బాబుమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ పూర్వ అధ్యక్షుడు బండి సంజయ్, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని ఆక్షేపించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకుల తీరు, తనకు పార్టీలో జరిగిన అవమానాలు, తన కుటుంబంపై పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలపై ఆయన స్పందించారు. పార్టీ స్పందించే తీరు బట్టి తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
సోషల్ మీడియాలో తనకు.. తన కుమారుడికి మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. దానిని వెంటనే నిలివేయాలని కోరారు. కనీసం తనకు మొదటి జాబితాలో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేయనని.. పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే సంతోషమే అని పేర్కొన్నారు. కానీ తమ మధ్య చిచ్చు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
TAGGED:
Cine Actor Babu Mohan on BJP