అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానాలు- పోస్ట్ ద్వారా 4వేల మంది సాధువులకు ఇన్విటేషన్ - అయోధ్య రామమందిరం ఓపెనింగ్ తేదీ
Published : Dec 2, 2023, 12:32 PM IST
Ayodhya Ram Mandir Opening Invitation Letter: అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం పోస్టల్ శాఖ సాయంతో ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు వేల మంది సాధువులకు ఈ లేఖలను పంపింది. ఈ పత్రికలు అందుకున్న సాధువులు.. ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం తమకు లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భారత తపాలా శాఖ సహకారంతో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుకలను నాలుగు దశలల్లో నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుక కోసం.. దేశ, విదేశాల్లోని 10 కోట్లకుపైగా కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.