Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!
Published : Oct 27, 2023, 9:17 PM IST
Attack On RTC Bus Driver: విధి నిర్వహణలో ఉన్న ఓ అర్టీసీ డ్రైవర్‌పై విచక్షణరహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపర్చిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు అడ్డుగా ఉన్న బైక్‌ను తీయమని డ్రైవర్ హరన్కొట్టడన్న నెపంతో.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో వాదనకు దిగి, బస్సును వెంబడించి డ్రైవర్‌పై మూకుమ్మడి దాడికి దిగారు. బస్సు నుంచి డ్రైవర్‌ను దింపి మరి విచక్షణరహితంగా, దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ కొట్టారు. గురువారం రోజున జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలో చర్చానీయంశంగా మారింది.
అసలేంజరిగిందంటే.. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. నెల్లూరు జిల్లాలోని కావలి నుంచి విజయవాడకు బయల్దేరింది. ఈ క్రమంలో కావలిలోని ట్రంకురోడ్డులో బస్సుకు అడ్డుగా ఉన్న బైక్‌ను తొలగించాలని.. డ్రైవర్ రాంసింగ్ హారన్కొట్టాడు. దీంతో ఆ ద్విచక్రవాహనాదారుడు రాంసింగ్‌పై వాదనకు దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ఆ ద్విచక్రవాహనదారుడు.. తన మిత్రులకు విషయం తెలియజేసి వారితో కలిసి ఆర్టీసీ బస్సును వెంబడించాడు. పట్టణ శివారులో మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ గోదాముల వద్దకు చేరుకోగానే అందరు కలిసి బస్సును అడ్డుకున్నారు. అంతేకాకుండా బస్సు దిగిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేస్తూ నానా దుర్భాషలాడారు. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీయగా అతనిపై దాడి చేసి.. చరవాణిని తీసుకుని పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయాలపాలైనా డ్రైవర్‌ను కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.