Asifabad Gurukula School Students Protest : 'మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు అంటే వద్దు' - ఆసిఫాబాద్‌లో విద్యార్థినుల ఆందోళన
Published : Aug 30, 2023, 2:11 PM IST
Asifabad Gurukula School Students Protest For Lack Of Facilities : ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ కుమురంభీం జిల్లా గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డుపై నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించిన విద్యార్థినులు వాహనాలను నిలిపివేయించి, కలెక్టర్ నివాసం ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఆసిఫాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు అక్కడి పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరసనబాట పట్టారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి తమను వేధిస్తోందని వాపోయారు. పాఠశాలలో తమకి భోజనం, వైద్యం సరైన సమయానికి అందించకపోవటంతో నరకయాతన అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Gurukula School Students dharna infront of Collector Residence :వాచ్‌మెన్‌గా పని చేస్తున్న కొందరు పురుషులు మద్యం సేవించి విధులకు వస్తున్నట్లు తెలిపారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో మానసికంగా వేదనకు గురవుతున్నట్లు ఆవేదన చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలని పాఠశాలలో చెప్పినా పట్టించుకునేవారు లేకపోవటంతో పైగా తమనే మాటలు అనేవారని అందుకు తాము రోడ్డెక్కినట్లు చెప్పారు. విద్యార్థినులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా మందులు ఇవ్వగ పోగా వారిపై శ్రద్ధ వహించడం లేదని వాపోయారు. ఇందులో భాగంగానే జాతీయ రహదారిపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం, కలెక్టర్ నివాసం వద్దకు వెళ్లిన విద్యార్థినులు, సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. చివరకు ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.