Art gallery exhibition in Hyderabad : 'విద్యార్థుల ప్రతిభకు.. ఈ చిత్రాలే ప్రత్యేక సాక్ష్యాలు' - తెలంగాణ న్యూస్
Art gallery exhibition in Hyderabad : హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీలో తెలంగాణ సాంఘీక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్ ఆధ్వర్యంలో క్రియేటివ్ హారిజన్స్ పేరిట ఆర్ట్, ఫొటోగ్రఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అనుభవజ్ఞులైన చిత్రకారులు, ఫొటోగ్రాఫర్లకు తీసిపోకుండా చిత్రాలు ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ విద్యార్థులను ప్రశంసించారు. ఆధ్యాత్మికతతో పాటు తెలంగాణ జీవన విధానం, సంప్రదాయాలను తెలియజేసేలా ప్రదర్శనలోని చిత్రాలున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2017లో 6వ తరగతి నుంచి ఫైన్ ఆర్ట్స్ కోర్సు ప్రవేశపెట్టామని.. ఇదే తొలి బ్యాచ్ అని సొసైటీ ప్రిన్సిపల్ మధులత అన్నారు. ఆనాటి నుంచి విద్యార్థులకు తమకు ఇష్టమైన ఆయా కోర్సులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ఉదయం తరగతి పాఠాలు ఉంటాయని.. మధ్యాహ్నం సమయంలో ఆర్ట్స్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించామన్నారు. విద్యార్థుల ప్రతిభకు ఈ చిత్రాలే ప్రత్యేక సాక్ష్యాలు అని ఆమె చెప్పారు. హైదరాబాద్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తమ చిత్రాలను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.