Vegetables at Kg 20 : వ్యాపారి పెద్ద మనసు.. ఏ కూరగాయ కొన్నా కేజీ రూ.20 మాత్రమే - ఇల్లందు మార్కెట్లో కూరగాయలు 20 రూపాయలు
Vegetables Kg Rs 20 At Illandu Market : ప్రస్తుతం కూరగాయ రేట్లు ఆకాశాన్ని అంటున్న తరుణంలో.. ఏ కూరగాయలైనా కేజీ రూ.20లకే అమ్ముతూ మంచి మనసు చాటుకుంటున్నారు ఓ వ్యాపారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఏ కూరగాయ అయినా రూ.20లకే కేజీ అమ్ముతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. దొండకాయ, వంకాయ, కాకరకాయ, సోరకాయ, బెండకాయ.. ఇలా ఏదైనా రూ.20కే అమ్ముతున్నారు.
గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ధరల భారం నుంచి పేద ప్రజలను గట్టెక్కించేందుకు ఇల్లందు మార్కెట్లో ఓ వ్యాపారి ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలతో పేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని భావించి.. ఏ కూరగాయనైనా కేజీ రూ.20కి అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. రూ.20కే కేజీ కూరగాయలు వస్తుండటంతో ప్రజలూ పెద్ద ఎత్తున కొంటున్నారు. టమాటాలతో పోటీ పడుతూ పెరుగుతోన్న కూరగాయల ధరల మధ్య రూ.20కే కేజీ కూరగాయలు అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.