Women Commission notices to Pawan: ఆధారాలు చూపండి.. పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు - Varahi Yatra Updates
AP Women Commission issued notices to Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 10వ తేదీన (ఆదివారం) ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ..'‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 30 వేల మంది అదృశ్యమైతే 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు. వైసీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు..? వారిలో మహిళలు ఎందరు..? వితంతువులున్నారా..? అని ఆరా తీస్తున్నారు. అందులో ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారాన్ని సేకరించి, సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు'' అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించింది.
10 రోజుల్లోగా ఆధారాలు చూపండి..రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. 'రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మాయమయ్యారని, దీనికి వాలంటీర్లే కారణమని, కేంద్ర ఇంటలిజెన్స్ మీకు చెప్పినట్లు వ్యాఖ్యానించారు కదా.. మీ కామెంట్లకు ఆధారాలు ఏంటి..? ఎంత మంది ఒంటరి మహిళలను వాలంటీర్లు సంఘ విద్రోహులకు అప్పగించారని కేంద్రం మీకు చెప్పింది..? దీనికి ఆధారాలు మీకు చూపారా..? నిరాధార ఆరోపణలతో మహిళలను భయభ్రాంతులకు గురిచేసే మాటలను రాజకీయం కోసం మాట్లాడుతున్నారా..? మీరు చెప్పిన మహిళల అదృశ్య లెక్కలు, ఆధారాలను 10 రోజులలోగా మహిళా కమిషన్‌కు మీరు స్వయంగా కానీ, మీ ప్రతినిధి ద్వారా కానీ తెలియపరచండి' అని పేర్కొంది. ఒకవేళ పవన్ కల్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు గానీ, ఆధారాలు గానీ ఇవ్వకపోతే.. వెంటనే మహిళలకు, వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.