దేవతల పెళ్లిలో పిడకల సమరం.. ఆచారాన్ని కొనసాగిస్తున్న గ్రామస్థులు - దేవతల పెళ్లిలో పిడకల సమరం
dung cakes fighting: కర్నూలు జిల్లా ఆస్పర్తి మండలంలోని కైరుప్పల గ్రామంలో ఏళ్లుగా ఓ వింత ఆనవాయితీ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఆ గ్రామంలో గురువారం పిడకల సమరం హోరాహోరీగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది మరుసటి రోజు ఈ సంప్రదాయ క్రీడను గ్రామస్థులు నిర్వహిస్తారు. వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారి వివాహ నేపథ్యంలో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆనవాయితీ వెనుక ఓ ఆసక్తికర కథనం.. ప్రచారంలో ఉంది.
త్రేతాయుగంలో భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. అయితే అమ్మవారిని పెళ్లి చేసుకునే విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో తమ భద్రకాళి దేవిని స్వామివారు ప్రేమించి.. పెళ్లి చేసుకోకుండా మోసం చేశారనుకున్న అమ్మవారి భక్తులు.. వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీర భద్ర స్వామి భక్తులు.. అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని వేడుకున్నా.. స్వామి వారు అటువైపు వెళ్లారు. దీంతో ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామిపై అమ్మవారి భక్తులు పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు.
ఈ ఆచారం నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆ గ్రామంలో పిడకల సమరం నిర్వహించారు. అందుకు జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్థులు ఇరువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. ఎప్పటిలాగే ఈ సంప్రదాయ క్రీడలో భాగంగా గాయాలపాలైన వారు ఆలయానికి వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న స్వామి వారి విభూతిని.. దెబ్బలు తగిలిన చోట పూసుకుని ఇళ్లకు వెళ్లారు. ఈ పిడకల సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్త జనాలు తరలివచ్చారు. పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించటం ఆనవాయితీ.