నది మధ్యలో చిక్కుకుపోయిన అంబులెన్స్.. లోపల నవజాత శిశువు, బాలింత.. ఆఖరికి.. - నదిలో చిక్కుకుపోయిన అంబులెన్స్
Ambulance Stuck in River : బిహార్ నవాదా జిల్లాలో నది మధ్యలో చిక్కుకుపోయింది అంబులెన్స్. నవజాత శిశువు, బాలింతను ఇంటికి తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు చెప్పారు. అనేక గంటల ప్రయత్నించి చివరకు నది నుంచి అంబులెన్స్‌ను బయటకు తీసుకువచ్చారు.
ఇదీ జరిగింది
గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దెలుహా గ్రామానికి చెందిన అరవింద్ కుమార్ భార్య లలితా దేవికి ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన లలితా దేవితో పాటు నవజాత శిశువును అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తున్నారు. ఆ గ్రామానికి వంతెన సౌకర్యం లేకపోవడం వల్ల నది మధ్యలో నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా నది ప్రవాహాం పెరగడం వల్ల అంబులెన్స్ నది మధ్యలో చిక్కుకుపోయింది. దీనిని గమనించిన గ్రామస్థులు ట్రాక్టర్ సహాయంతో అంబులెన్స్‌ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల జేసీబీని తీసుకువచ్చి బయటకు తీశారు.
తమ గ్రామానికి వంతెన సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నది దాటేందుకు అనేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఓట్లు వేసేటప్పుడు వంతెన నిర్మిస్తామని చెప్పి.. ఆ తర్వాత మొహం చాటేస్తున్నారని ఆరోపించారు.