Adivasi Padayatra at Adilabad : మళ్లీ తెరపైకి ఆదివాసీ ఉద్యమం.. ఇళ్లస్థలాలు, పట్టాలకై చలో ప్రగతి భవన్ - ఆదివాసీ పాదయాత్ర
Published : Oct 2, 2023, 10:14 PM IST
Adivasi Padayatra at Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి ఆదివాసీ ఉద్యమం తెరపైకి వచ్చింది. ఆదివాసీ హక్కులను కాపాడాలనీ.. అర్హులందరికీ ఇళ్లస్థలాలు, స్థలాలున్నవారికి పట్టాలు ఇవ్వాలనీ తుడుందెబ్బ నేతలు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఛలో ప్రగతిభవన్ పేరిట ఆదిలాబాద్ నుంచి శాంతియుత పాదయాత్ర ప్రారంభించారు. స్థానిక సర్వేనెంబర్ 72లో ఆక్రమిత స్థలాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కుమురంభీ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 200 మందితో ఇవాళ చేపట్టిన పాదయాత్ర ఈనెల 10న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుతుందని నిర్వాహకులు తెలిపారు.
ప్రగతి భవన్‌లో అనుమతి లభించకుంటే.. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. స్థానికంగా జిల్లా ఉన్నతాధికారులకు అనేక సార్లు దరఖాస్తు పెట్టుకున్నట్లు వివరించారు. అదేవిధంగా వారి సమస్యను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వాపోయారు. అందుకే ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని శాంతియుత ఉద్యమంలో భాగంగానే పాదయాత్ర చేపట్టామని తుడుందెబ్బ నేతలు వివరించారు.