చనిపోయిన యజమానుల కోసం నిరీక్షణ.. రోజూ గేటు ముందు విలపిస్తున్న శునకం - ఉత్తర్‌ప్రదేశ్‌లో యజమానుల కోసం కుక్క పడిగాపులు
ఈ వీడియోలో కనిపిస్తున్న శునకం పేరు ఛోటు. ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లోని శాస్త్రీనగర్‌కు చెందినది. ఒకప్పుడు యజమానుల అనురాగాల మధ్య పెరిగిన ఈ శునకం ప్రస్తుతం ఎవరూ లేక ఒంటరైంది. అనారోగ్యంతో యజమానులు మరణించారనే విషయం తెలియని ఛోటు.. కొన్ని నెలలుగా వారి రాక కోసం వేచి చూస్తోంది. కొన్నిసార్లు వీధి అంతా వినపడేలా ఏడుస్తోంది. స్థానికులు పెట్టిన ఆహారం తింటూ తాను ఒకప్పుడు ఉన్న ఇంటి గేటు ముందు పడిగాపులు గాస్తోంది. ఎవరైనా అక్కడి నుంచి తీసుకెళ్లాలని చూసినా వారితో వెళ్లేందుకు నిరాకరిస్తోంది.
పీయుశ్ శర్మ, మధు శర్మ అనే దంపతులు ఈ ఇంటిలో ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో ఈ శునకాన్ని అల్లారుముద్దుగా పెంచారు. ఛోటు కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. పిల్లలను పెంచినట్లు పాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను ఇచ్చేవారు. అయితే వారిద్దరూ అనారోగ్యంతో మరణించడం, ఇంటికి బ్యాంకు లోను ఉండటం వల్ల.. అధికారులు తాళం వేశారు. ఇక అప్పటి నుంచి ఈ శునకం గేటు బయటే ఉంటోంది. యజమానులకు బంధువులు ఉన్నప్పటికీ వారెవరూ ఇక్కడకు రారని స్థానికులు తెలిపారు. తనని పెంచిన వారి కోసం ఛోటు ఎదురుచూసే విధానం చూస్తే కంటతడి పెట్టిస్తోందని చెప్పారు.