SI గన్ లాక్కుని చెట్టెక్కిన దొంగ.. పోలీసులు అనేక గంటలు బతిమలాడితే.. - SI రివాల్వర్ ఎత్తుకెళ్లిన దొంగ
కర్ణాటకలోని కలబురగిలో ఓ అంతరాష్ట్ర దొంగ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఓ చోరీ కేసులో అఫ్జల్‌పుర్‌లోని బల్లురాగి గ్రామానికి చెందిన ఖాజప్ప గైక్వాడ్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఓ చోట కారులో కూర్చుని ఉన్న ఖాజప్పను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ఏకంగా SI తుపాకీ లాక్కొని పారిపోయాడు. సర్వీస్ రివాల్వర్ లోడై ఉండటం వల్ల పోలీసులు కంగారు పడ్డారు. నిందితుడి కోసం రాత్రంతా గాలించినా ఫలితం లేకుండా పోయింది.
సోమవారం ఉదయం బల్లురాగి గ్రామానికి సమీపంలోని ఓ చెట్టుపై నిందితుడు ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్టు నుంచి కిందకు దిగమని కోరగా.. దిగితే పోలీసులు కాల్చి చంపుతారని దాని బదులు తనకు తానే కాల్చుకుంటానని ఖాజప్ప హెచ్చరించాడు. కొన్ని గంటల పాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు దొంగకు నచ్చజెప్పి కిందకు దించారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖాజప్ప అంతరాష్ట్ర దొంగ అని.. అతనిపై 20కి పైగా చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.