A Man tried to Suicide in Sangareddy : డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని.. బస్సు కింద పడిన వ్యక్తి.. చివరికి? - double bed room issue
A Man tried to Suicide in Sangareddy : రెండు పడకల ఇల్లు మంజూరైనా.. ఇవ్వలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కదులుతున్న బస్సు ముందుకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామానికి చెందిన బట్టు చిరంజీవి జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లాడు. అక్కడ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల రెండు పడకల ఇళ్లలో ఒకటి అతని భార్య పేరు మీద మంజూరయింది. అయితే రెండు పడకల ఇళ్ల నిర్మాణంలో చిన్న చిన్న పనుల వల్ల లబ్ధిదారులకు కేటాయించడం ఆలస్యమైంది.
త్వరగా రెండు పడకల ఇళ్లను ఇవ్వాలని పలుమార్లు అధికారుల చుట్టూ, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో విరక్తి చెంది.. పుల్కల్ మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ ఉన్న కొంతమంది నచ్చజెప్పి పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై నుంచి పక్కకు వచ్చాడు. ఇంతలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు నడిపాడు. ఇది గమనించిన బట్టు చిరంజీవి పరిగెత్తుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. దీంతో అతడ్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయం అయింది. వెంటనే స్థానికులు అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.