Live Video : చెరువులో చేపల వేటకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోయాడు.. కాపాడే ప్రయత్నం చేసినా..!
Man Died in Pond in Nizamabad: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుందని.. ప్రజలు చెరువుల వద్దకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే పలు సూచనలు ఇస్తున్నారు. వాటిని కొంత మంది వ్యక్తులు పెడచెవిన పెడుతూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విధంగానే ఓ వ్యక్తి చెరువు పొంగి పొర్లుతుందన్న విషయం తెలిసీ చేపల వేటకు వెళ్లాడు. కట్ చేస్తే.. అంతలోనే విగత జీవిగా మారాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుండారం గ్రామ చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆ గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి చేపలు పట్టేందుకుని ఆ చెరువు వద్దకు వెళ్లాడు. కాసేపటికే ప్రమాదవశాత్తు నీటిలో పడి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన స్థానికులు వ్యక్తిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయింది. బయటకి తీసేలోపే అతని ప్రాణం పోయింది. ఈ విషయం గ్రామస్థులు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.