యడియూరప్పకు తప్పిన ముప్పు.. ల్యాండ్ అవుతుండగా.. - బీఎస్ యడియూరప్ప కలబురగి టూర్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా గాల్లోకి ప్లాస్టిక్ షీట్స్, చెత్త ఎగిరి హెలిప్యాడ్‌పైకి వచ్చాయి. పైలట్ వెంటనే అప్రమత్తమై హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించారు. దీంతో యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవ్వకుండానే వెనుదిరిగింది. కాసేపు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. హుటాహుటిన హెలిప్యాడ్‌ను అధికారులు శుభ్రం చేయించారు. కాసేపటికి హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సురక్షితంగా కిందకు దిగారు. కలబురిగిలోని జేవర్జిలో ఓ కార్యక్రమానికి యడియూరప్ప సోమవారం హాజరవుతుండగా ఈ ఘటన జరిగింది.
యడియూరప్ప 2022 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం యడియూరప్ప కలల ప్రాజెక్టు అని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో యడియూరప్ప కూడా పాల్గొనగా.. రాజకీయాల్లో ఆయన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.