A Girl Killed her Mother Along With Boyfriend: దత్త పుత్రిక దాష్టీకం.. ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక - Andhra Pradesh viral news
Published : Oct 21, 2023, 10:53 PM IST
|Updated : Oct 22, 2023, 7:16 AM IST
A Girl Killed her Mother Along With Boyfriend: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కంబాలపేటలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం పెంపుడు తల్లిని ఓ దత్తపుత్రిక తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. 13 ఏళ్లకే బాలిక చెడు వ్యసనాల బారిన పడడంతో.. పెంపుడు తల్లికి తెలిసి మందలించడం మొదలుపెట్టింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య వివాదాలు మొదలయ్యాయి. తల్లి చెబుతున్న మాటలన్నీ తనపై ద్వేషంతోనే చెబుతున్నట్లుగా భావించిన బాలిక.. ప్రియుడు, స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. ''రాజమహేంద్రవరం కంబాలపేటకు చెందిన మార్గరెట్ జులియానా(63) అనే విశ్రాంత ఉపాధ్యాయురాలికి సంతానం లేకపోవడంతో 13ఏళ్ల క్రితం ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంది. జులియానా భర్త నాగేశ్వరరావు ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పని చేసి, పదవీ విరమణ అనంతరం రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. తన 13ఏళ్ల దత్తత కుమార్తెతో కలిసి ఆమె కంబాలపేటలో నివాసం ఉంటుంది. చిన్నారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. రూ.కోట్ల ఆస్తికి వారసురాలు కావడంతో బాలిక అడిగిందల్లా ఇచ్చింది. 13 ఏళ్లకే ఆ బాలిక ఓ 19 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడి.. జల్సాలకు అలవాటుపడింది. పెంపుడు తల్లికి తెలిసి మందలించడంతో ప్రియుడితోకలిసి వ్యూహరచన చేసి, మరో ఇద్దరు యువకుల సాయంతో జులియానాను హతమార్చింది'' అని పోలీసులు ఘటన వివరాలను వెల్లడించారు.