స్కూటీ నడుపుతూ స్నానం.. రోడ్డుపై యువకుడు హల్చల్.. రూ.2000 ఫైన్! - స్కూటీపై యువకుడి ఓవర్ యాక్షన్
తమిళనాడు తంజావూరు జిల్లాలోని కీజవాసల్ ప్రాంతంలోని రోడ్లపై బుధవారం ఓ యువకుడు హల్చల్ సృష్టించాడు. స్కూటీపై నీళ్ల బకెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ స్నానం చేశాడు. ఈ ఘనకార్యాన్ని అతడి స్నేహితుడు ఫోన్లో వీడియో తీశాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్గా మారి జిల్లా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. వీడియోలో కనిపించిన వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. దీనిని తీవ్రంగా పరిగణించిన పైఅధికారులు ఘటనకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా రూ.2000 చొప్పున జరిమానా విధించి ఇంకోసారి ఇలా వ్యవహరించొద్దని హెచ్చరించి పంపించేశారు. కాగా, నిందితులను ప్రసన్న (24), అరుణాచలం (23)గా గుర్తించారు పోలీసులు. అయితే ఈ మధ్య కొందరు ఆకతాయిలు పాపులారిటీ కోసం ఈ రకంగా వింత చేష్టలకు పాల్పడుతున్నారని ట్రాఫిక్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ రవిచంద్రన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు చూసి రోడ్లపై ప్రయాణించే వారు భయాందోళనలకు గురై రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు.