పొలానికి సెలైన్ బాటిల్ పెట్టిన రైతన్న అందుకోసమేనటా - saline bottles in paddy field in siddipet
ఆరుగాలం కష్టపడి పండించే పంటను కాపాడుకోవడానికి రైతులు అహర్నిశలు శ్రమిస్తుంటారు. పంట వేసింది మొదలు.. చేతికొచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. పంటను చీడపీడలు, ఎలుకలు, పశుపక్షాదులు పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటుంచారు. ఇంత చేస్తున్నా వివిధ రకాల వైపరీత్యాలు, నష్టాలు రైతును పలకరిస్తూనే ఉంటాయి. వాటి నుంచి ఎలాగో తప్పించుకోలేని అన్నదాతలు తమ చేతిలో ఉన్నది, తమకు చేతనైనది చేసి పంటను రక్షించుకుంటుంటారు. ఇంతుకోసం రైతన్నలు వినూత్న ఆలోచనలు చేస్తుంటారు. ఇదే కోవలోకి వస్తారు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు మంద చిన్న లచ్చయ్య.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లికి చెందిన మంద చిన్న లచ్చయ్య అనే రైతు తాను వేసిన ఒకటిన్నర ఎకరం వరి పొలాన్ని ఎలుకల బారి నుంచి కాపాడుకోవడానికి గ్లూకోజ్ సెలైన్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. 50 నుంచి 60 సెలైన్ బాటిళ్లను కర్రలకు కట్టి వాటిని పొలంలో అక్కడక్కడ వేలాడదీశాడు. గాలికి సెలైన్ బాటిళ్లు కర్రలకు తగిలి.. దాని ద్వారా వచ్చే శబ్ధంతో ఎలుకలు పొలంలోకి రాకుండా ఉంటాయని రైతు తెలిపాడు. బాటిళ్ల చప్పుడుకు కొంగలు కూడా రావని, కర్రలపై పక్షులు వాలడం వల్ల వాటి భయానికి కూడా ఎలుకలు రావని చెపుతున్నాడు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నామని.. ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉందని లచ్చయ్య హర్షం వ్యక్తం చేశారు. పొలంలో గ్లూకోజ్ బాటిళ్లు కనిపిస్తుండటంతో అటుగా వెళుతున్న వారు ఆసక్తిగా చూస్తున్నారు.