చుట్టూ వరద- భయంతో 39 గంటలు చెట్టుపైనే వృద్ధుడు - తిరునెల్వేలిలో 39 గంటలు చెట్టుపైనే గడిపిన వ్యక్తి
Published : Dec 20, 2023, 4:48 PM IST
A Farmer On Tree For 39 Hours In Tamil Nadu :తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని కొలుమడై గ్రామంలో 72 ఏళ్ల చెల్లయ్య అనే ఓ వృద్ధుడు ఏకంగా 39 గంటలు నిద్రాహారాల్లేకుండా చెట్టుపైనే గడిపాడు. చివరకు సహాయక సిబ్బంది అతి కష్టం మీద అతడిని కాపాడారు.
చెల్లయ్య తన తోటనే ఇంటిగా మార్చుకొని 20 మేకలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం (డిసెంబర్ 17న) చెల్లయ్య ఇంటికి దగ్గర్లోని కాలువకు గండి పడింది. దీంతో అతడి తోట చుట్టూ వరద నీరు చేరింది. పెంచుకున్న మేకలు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. భయంతో చెల్లయ్య తోటలోని ఓ చెట్టుపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపాడు. విషయం తెలుసుకున్న అతడి కుమారుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గంటపాటు శ్రమించి చెట్టుపై చిక్కుకుపోయిన వృద్ధుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.