రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు.. ఫ్లెక్సీ వివాదమే కారణం - రాళ్లు రువ్వుకున్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు
కర్ణాటక బెంగళూరులో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్లెక్సీ ఏర్పాటులో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని శాంతింపజేశారు. ఈ వివాదంలో పోలీసు అధికారులకు సైతం గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయనగర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై 3 వేర్వేరు ఎఫ్ఐఆర్లతో 36 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన బెంగళూరులోని గోవిందరాజ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజీఎస్ మైదానంలో జరిగింది. ఆదివారం జరిగే ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనికి బీజేపీ కార్యకర్తలు అడ్డుచెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇరు పార్టీల పరస్పర ఎఫ్ఐఆర్లతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో పలువురిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పశ్చిమ డీసీపీ లక్ష్మణ్ తెలిపారు.