ఎంపీ కారు బానెట్‌పై యువకుడు.. 3కి.మీలు లాక్కెళ్లిన డ్రైవర్.. చివరకు..
దేశ రాజధాని దిల్లీలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు. కారు బానెట్‌పై పడ్డ వ్యక్తిని సుమారు 3కి.మీల వరకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆశ్రమ్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. "నేను క్యాబ్ డ్రైవర్‌ను.. ఓ ప్యాసింజర్‌ను విడిచి పెట్టి తిరిగి ఇంటికి వెళ్తున్నాను. నేను ఆశ్రమ్ చౌక్ సమీపంలోకి చేరగానే ఓ కారు నా వాహనాన్ని కావాలని మూడుసార్లు ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌ను నిలదేసే ప్రయత్నం చేశాను. ఇందుకోసం నా కారు దిగి అతడి కారు ముందు నిలబడ్డాను. అయినా అతడు కారును అలానే ముందుకు పోనిచ్చాడు. దీంతో నేను కారు బానెట్‌పై పడ్డాను. అలా నన్ను ఆశ్రమ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లాడు. కారు ఆపమని ఎంత అరిచినా డ్రైవర్ వినిపించుకోలేదు. అప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నాడని తెలుసుకున్నాను. దారిలో నాకు పోలీసుల వాహనం కనిపించింది. వారు మమ్మల్ని చూసి నిందితుడి వాహనాన్ని వెంబడించారు. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో నిజాముద్దీన్ దర్గా వద్ద అతడు కారును ఆపాడు" అని బాధితుడు చేతన్ చెప్పాడు.
మరోవైపు.. "నా కారు అతడి కారును తాకలేదు. అతడు కావాలనే నా కారు బానెట్‌పైకి దూకాడు. ఆ సమయంలో నేను డ్రైవింగ్ చేస్తున్నాను. నేను అతడిని దిగమని అడిగాను.. కానీ అతడు దిగలేదు. అప్పుడు నేను నా కారును ఆపి ఏం చేస్తున్నావ్ అని అడిగాను" అని నిందితుడు రాంచంద్ కుమార్ చెబుతున్నాడు. కాగా, ఆ కారు బిహార్‌కు చెందిన ఓ ఎంపీది అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనా సమయంలో డ్రైవర్ మాత్రమే కారులో ఉన్నాడు.