కారు పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం.. 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ఢీ కొట్టగా 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కోయంబత్తూరు జిల్లాలోని వన్నారపేటలో జనవరి 18న జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు యజమాని సయ్యద్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కారు పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సయ్యద్ ఇటీవలే కొత్త కారు కొనగా తన ఇంటి వద్ద దాన్ని పార్కింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో రైఫుద్దీన్ బషీద్ అనే 8ఏళ్ల బాలుడు అటుగా సైకిల్‌పై వెళ్తున్నాడు. దీంతో బషీద్ అక్కడే కొద్దిసేపు వేచి ఉన్నాడు. ఎంతకీ కారు పార్కింగ్ చేయడం పూర్తి కాకపోవడం వల్ల ఆ చిన్నారి సైకిల్‌తో ముందుకు వెళ్లాడు. అయితే అదే సమయంలో కారు యజమాని.. బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను తొక్కాడు. దీంతో ఆ చిన్నారి.. కారు, ఎదురుగా ఉన్న గోడ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.