పాలు ఇస్తున్న 29 రోజుల లేగ దూడ.. రోజుకు ఎంతంటే..
బంగాల్ రాష్ట్రం ముర్షీదాబాద్ జిల్లాలోని షుకురియా గ్రామంలో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. కేవలం 29 రోజుల వయసున్న ఆవు దూడ పాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు లేగ దూడను చూడటానికి తరలివస్తున్నారు. అంతేగాక దీనిని దైవకార్యంగా భావించి ఆ చిట్టి దూడకు పూజలు సైతం చేస్తున్నరు.
తన దూడ నెల వయసు నిండాకుండానే పాలు ఇవ్వడం.. దైవ సంకల్పం ద్వారానే సాధ్యమవుతోందని యజమాని ఉత్తమ్ మొండల్ చెబుతున్నారు. తన ఇంట్లో శాలిగ్రామ శిల ఉందని.. దానికి రోజు పాలతో అభిషేకం చేసి పూజలు చేస్తానని చెప్పారు ఈయన. ఈ పూజా ఫలితం దూడ పాలివ్వడం ద్వారా పొందుతున్నానని అంటున్నారు యజమాని. విశేషమేంటంటే ప్రస్తుతం ఈ దూడ ఏకంగా 750 మిల్లీలీటర్లు పాలు ఇస్తోంది.
దూడ పుట్టే సమయంలో చాలా ఇబ్బందులు పడిందని ఉత్తమ్ మొండల్ అన్నారు. దూడ బరువు కూడా సాధారణ దూడల కంటే కూడా అధికంగానే ఉందని చెప్పారు. దూడ పుట్టిన 21 రోజుల తర్వాత దాని శరీరంలో పాల గ్రంధులు పెరగడాన్ని గమనించానని తెలిపారు ఉత్తమ్ మొండల్. మరోవైపు.. పాలు ఇస్తున్న దూడ ప్రస్తుతం తల్లి ఆవు పాలు కూడా తాగుతోంది.
29 రోజుల దూడకు పాలు పితికే వీడియో చూసిన పశువైద్యుల ఇది అసాధారణమైన విషయమని అంటున్నారు. దూడ శరీరంలోని పాల గ్రంధి హార్మోన్ల అసమతుల్యత కారణంగానే పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశువైద్యుడు అమితాబ్ దాస్ అన్నారు. దీంట్లో ఎటువంటి దైవకార్యం లేదని కొట్టిపారేస్తున్నారు పశువైద్యులు. అయితే ఈ దూడ ఇలా ఎన్ని రోజులు పాలు ఇస్తుందో అనే దానిపై స్పష్టత లేదని చెప్పారు వైద్యుడు.
TAGGED:
29 Days Old Calf Giving Milk