కొత్త ఏడాదికి ఘనంగా భారత్ ఆహ్వానం- భక్తులతో ఆలయాలు కిటకిట
Published : Jan 1, 2024, 8:34 AM IST
2024 New Year Celebration India :కొత్త ఏడాదికి యావత్ భారత్ ఘనంగా స్వాగతం పలికింది. బాణసంచా వెలుగుల్లో నగరాలు మెరిసిపోయాయి. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాలు విద్యుద్దీప కాంతులతో ధగధగలాడాయి. రాష్ట్రపతి భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నార్త్, సౌత్ బ్లాక్‌లు రంగురంగుల లైట్లతో ప్రకాశిస్తూ అందంగా మెరిసిపోయాయి. దిల్లీ కన్నాట్ ప్రాంతంలో యువత కేక్‌లు కట్ చేసి వేడుక చేసుకున్నారు. ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన వేడుకల్లో యువత ఆనందడోలికల్లో మునిగితేలింది. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో పెద్దసంఖ్యలో యువత చేరుకొని కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. బంగాల్లోని బీర్భూమ్లో నూతన సంవత్సర వేడుకల్లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీవిందర్ సింగ్ కొత్త సంవత్స వేడుకల్లో పాల్గొన్ని నృత్యం చేశారు.
మరోవైపు, నూతన సంవత్సరం వేళ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. శిర్డీ సాయి బాబా దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తమిళనాడు మధురైలోని మీనాక్షి ఆలయం, చెన్నెలోని మురుగున్ ఆలయాలకు భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో 2023 ఏడాది చివరిరోజు సందర్భంగా సిక్కులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.