హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత రాజసం.. వీడియో చూశారా..!
Ambedkar Statue in Hyderabad: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సభకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అదే విధంగా పరిసరాలను కార్యక్రమం కోసం తీర్చిదిద్దుతున్నారు.
అంబేడ్కర్ విగ్రహం దిగువన ప్రాంగణంలో.. తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు ఆ పనులు పూర్తిచేసి ఆ తర్వాత అలంకరణ పనులు చేపట్టనున్నారు. పక్కనే బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఉన్నతాధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
విగ్రహావిష్కరణ, బహిరంగ సభ ఏర్పాట్లు, నిర్వహణను ఆయా ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత పనుల పర్యవేక్షణ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14న మధ్యాహ్నం మూడు గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులందరినీ ప్రభుత్వం ఆదేశించింది.