100 Years Old Couple Wedding Medak : వందేళ్ల వయసులో దంపతుల వివాహం.. 100 కిలోల కేకుతో సంబురాలు - మెదక్ జిల్లాలో వందేండ్ల వృద్ధ దంపతులకు పెండ్లి
Published : Oct 19, 2023, 2:13 PM IST
100 Years Old Couple Wedding Medak :వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతులకు.. కుటుంబ సభ్యులు శతాబ్ది వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన వాజ్ఞ నాగయ్యకు 105 ఏళ్లు కాగా అతడి భార్య సుగుణమ్మకు 100 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీరి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు బలగం అంతా కలిసి గ్రామంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద పెళ్లి వేడుక నిర్వహించారు. ఇద్దరికీ మళ్లీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. వృద్ధ దంపతులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర, బెల్లం పెట్టుకుని అలనాటి తమ పెళ్లి వేడుకను గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు.
పెళ్లి అనంతరం ప్రత్యేకంగా వంద కేజీల కేకును వృద్ధ దంపతులతో కట్ చేయించారు. అందరూ కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఆనందంగా గడిపారు నాగయ్య, సుగుణమ్మ దంపతులకు 11 మంది సంతానం. ఆరుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు మొత్తం బలగం అంతా కలిపి ఈ కుటుంబంలో 300 మంది వరకు ఉన్నారు.