గంజాయి రవాణా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఉత్తర్‌ప్రదేశ్ వయా హైదరాబాద్ - అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - అబ్దుల్లాపూర్‌మెట్‌లో కోటి విలువైన గంజాయి స్వాధీనం
Published : Dec 14, 2023, 6:20 PM IST
1 Crore Worth Ganja Spotted in Abdullapurmet :ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా వద్ద నుంచి రూ.కోటి విలువైన 360 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వికాస్ త్యాగి, అర్బార్, మహ్మద్ అమీరుద్దీన్ వీరంతా స్నేహితులు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి గంజాయి ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ సంపూర్ణ హోటల్ వద్ద పోలీసుల తనిఖీల్లో నిందితులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి బయటపడింది.
గంజాయి వీరి నుంచి కొనుగోలు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తి నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ముఠా వద్ద నుంచి గంజాయితో పాటు కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మత్తు ముఠాల మూలాలపై దృష్టి సారించినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఓఆర్ఆర్ సహా జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేస్తున్నట్లు సుధీర్‌బాబు వివరించారు.