క్రిస్మస్ ఎఫెక్ట్- కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్! - హంగేరీ, సెర్బియా బార్డర్
Heavy traffic jam: క్రిస్మస్, నూతన ఏడాది సెలవుల నేపథ్యంలో.. పశ్చిమ ఐరోపా దేశం జర్మనీ నుంచి స్వదేశాలకు పయనమయ్యారు బాల్కన్ పౌరులు. దీంతో సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హంగేరీ, సెర్బియా మధ్య సరిహద్దులో వేలాది మంది భారీ క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సెర్బియా, మెకెడోనియా, కోసోవో, బోస్నియా వంటి దేశాల ప్రజలు జర్మనీలో పని చేస్తున్నారు. సాధారణంగా శీతాకాలం, వేసవిలో సెలవు దినాల్లో స్వదేశానికి సొంత వాహనాల్లో వెళ్తుంటారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెర్బియాలో రోజుకు 1500 కేసులు వస్తున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.