మదిని దోచుకుంటున్న చిత్ర ప్రదర్శన - జాతీయ స్థాయి చిత్రకళ ప్రదర్శన
అక్షర సాధ్యం కాని భావాలకు కుంచె ప్రాణం పోస్తుంది. మదిలో ఆలోచనలకు కుంచెతో రూపమిచ్చి... ఇంద్రధనస్సు రంగులద్ది... చిత్రంలో ఎన్నో సిత్తరాలు చూపించడం చిత్రకారుల సొత్తు. మైమరిపించే ప్రకృతి సొయగాలు... పరవశింపజేసే పల్లె పడుచుల అందచందాలు... నేటి జనజీవన స్థితిగతులకు అద్దం పట్టే అద్భుతమైన చిత్రాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో చిత్ర కళాభిమానుల మదినిదోస్తున్నాయి. పెరిగిపోతున్న కాలుష్య భూతం, నగర ట్రాఫిక్ సమస్యలు... అంతరించిపోతున్న పక్షిజాతి వంటి చిత్రాలు వీక్షకులను అలోచింపచేస్తున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జాతీయ స్థాయి చిత్రకళ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్రకారుల ప్రతిభ ఇక్కడ ఆవిష్కృతమైంది.