అట్లుంటది మోహన్ బాబుతో.. పెళ్లి మండపం నుంచి నేరుగా షూటింగ్ స్పాట్‌కు.. - యాక్టర్ బ్రహ్మాజీ సతీమణి
టాలీవుడ్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మాజీ. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అప్పటి స్టార్స్‌ను ఇప్పటి వరకున్న అందరి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న 'అలా మొదలైంది' అనే టీవీ షోకు ఇటీవల తన సతీమణి శాశ్వతితో కలిసి వచ్చి సందడి చేశారు. వ్యాఖ్యాత వెన్నెల కిశోర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తమ జీవితాల్లో జరిగిన పలు ఆసక్తికర ఘటనల గురించి చెప్పుకొచ్చారు.
బ్రహ్మాజీ, శాశ్వతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసిన ఈ జంట.. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కృష్ణవంశీ చంద్రలేఖ సినిమాలో బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఇక ఆ మూవీ టీమ్ అన్నీ తామై చూసుకుని వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఓ ఘటన గురించి బ్రహ్మాజీ సతీమణి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
"పెళ్లైన తర్వాత ఓ గ్రూప్ ఫొటో దిగాం. ఇక అంతే.. బ్రహ్మాజీతో సహా అందరూ హడావుడిగా బయలుదేరారు. అయితే దీనికి కారణం మోహన్‌బాబు సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఆ సినిమా యూనిట్‌కు సంబంధించిన కారు బయట వెయిట్ చేస్తోంది. దీంతో పెళ్లి షర్టు, ప్యాంట్ బ్రహ్మాజీ మార్చుకుని వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత మళ్లీ వచ్చారు." అని వెల్లడించారు శాశ్వతి.
ఇక ఇదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ.. "చాలా మంది ఆర్టిస్ట్‌ల కాంబినేషన్ కావడం వల్ల పెళ్లి అవ్వగానే షూటింగ్‌కు రమ్మని మోహన్‌బాబు చెప్పారు. అనంతపురంలో నా రూమ్మేట్ కమెడియన్ ఏవీఎస్. ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత రూమ్‌కు వెళ్తే 'ఫస్ట్ నైట్ నాతో గడుపుతున్నావ్' అని ఆయన నన్ను సరదాగా ఆటపట్టించారంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.