SSC friends Reunion in Koppunur : పాత జ్ఞాపకాలు.. తీపి గుర్తులతో.. ఎమోషనల్‌గా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - తెలంగాణ తాజా వార్తలు
Old Students Gathering in Koppunur : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994 - 95 ఎస్.ఎస్.సి. బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పదో తరగతి పూర్తైన 28 ఏళ్ల అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి ఒకే వేదికపై కలిశారు. ఆత్మీయ పలకరింపులు, యోగక్షేమాలతో సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వివిధ రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ ఒక్క చోటకు చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పాఠశాల పూర్తైన 28 ఏళ్ల తరువాత కలిసిన సంతోషంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల కలయికతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిన్ననాటి స్మృతులు, పాఠశాలలో అనుభవాలను పూర్వ విద్యార్థులు స్మరించుకున్నారు. విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యతో పాటు మంచిచెడులు బోధించిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు విద్యను బోధించి జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి మేలు చేయాలని ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఆశీర్వదించారు. పాఠశాలకు తమ వంతుగా వాటర్ ఫిల్టర్‌ను పూర్వ విద్యార్థులు అందించారు. విశ్రాంత ఉపాధ్యాయులు చంద్రశేఖర్, దశరథసింగ్, వెంకటయ్య, ఖలీల్ ఉల్ రెహ్మాన్, సుధాకర్ రెడ్డి, సైఫోద్దీన్, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహ, ఉపాధ్యాయురాలు శర్మిష్ట, పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల పిల్లల్లో కొందరు పాటలు పాడి, నృత్యం చేసి అందరినీ అలరించారు.