Dil Raju TFCC Elections : 'ఏ పార్టీలోకి వెళ్లినా ఎంపీగా గెలుస్తాను'..దిల్ రాజు హాట్ కామెంట్స్
Dil Raju TFCC Elections : తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ప్యానెల్ సభ్యులతో మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో అడుగుపెడితే ఏ పార్టీ నుంచైనా ఎంపీగా గెలుస్తానని అన్నారు. అయితే తన తొలి ప్రాధాన్యత సినిమా రంగానికే ఉంటుందంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాలు వేరు,రాజకీయాలు వేరని వ్యాఖ్యానించారు.
సీనియర్లెవరూ ముందుకు రాకపోవడం వల్ల ఈ సారి తాను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా తనకేం కిరీటాలు పెట్టరని, తనకు కొత్త సమస్యలు వచ్చినట్టేనంటూ వ్యాఖ్యానించారు. అయితే, సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడినట్లు పేర్కొన్నారు. గతంలో సీనియర్లు ఎవరైనా ముందుకు వస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేనందున ఈ ఎన్నికలు అనివార్యమైనట్లు దిల్ రాజు వివరించారు.
అధ్యక్షుడిగా పోటీ చేయడం తన కార్యాలయంలోని సిబ్బందికి, కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినప్పటికీ.. సినీ పరిశ్రమ భవిష్యత్ కోసం ముందడుగు వేసినట్లు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయిలో ముందుకెళ్తున్నందున తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను బలోపేతం చేసి రానున్న తరాలకు అందించే బాధ్యత తమపై ఉందన్నారు. రెండేళ్ల పదవికాలంలో ఒక సంవత్సరం తనకు ఇస్తే ఫిల్మ్ ఛాంబర్ బై లాస్ సవరించి చిత్ర పరిశ్రమ ఎలా ముందుకెళ్తే బాగుంటుందో నిర్దేశిస్తాతనని దిల్ రాజు పేర్కొన్నారు.
TFCC Elections 2023 : మరోవైపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. అధ్యక్ష బరిలో సి.కళ్యాణ్ ప్యానెల్.. దిల్ రాజు ప్యానెల్ తో పోటీపడనుంది. మొత్తం 1560 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు నూతన అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.