కోలీవుడ్‌కు పవన్ కీలక సూచన.. అలా చేస్తేనే 'RRR' లాంటి సినిమా చేయగలరంటూ.. - కోలీవుడ్‌కు పవన్ కల్యాణ్ కీలక సూచన
Pawan Kalyan About Tamil Industry : ఇటీవల తమిళ సినిమాల షూటింగ్‌ల విషయంలో అక్కడి సినీ పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయాలపై స్పందించారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలో తమిళ సినీ పెద్దలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన ఆయన.. తమిళ చిత్ర పరిశ్రమలో అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. మంగళవారం జరిగిన 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ అంశం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో అన్ని భాషల వాళ్లు పనిచేస్తున్నారని, ఇక్కడి పరిశ్రమ అందరికి అక్కున చేర్చుకుంటుందని ఆయన అన్నారు. అందుకే తమిళ చిత్ర పరిశ్రమ కూడా అన్ని భాషల వాళ్లకు అవకాశం కల్పిస్తేనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు తమిళం నుంచి కూడా వస్తాయని ఆయన అన్నారు. రోజా, జెంటిల్ మెన్ లాంటి చిత్రాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చాయంటే అందుకు తెలుగు నిర్మాత అయిన ఎ.ఎం.రత్నం లాంటి వ్యక్తులు కారణమన్నారు. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికులకు సమస్యలు ఉంటే వేరే విధంగా పరిష్కరించుకోవాలని సూచించిన పవన్ కళ్యాణ్.... తమిళ చిత్ర పరిశ్రమ విస్తృత పరిధిలో ఆలోచించాలని కోరారు.