Leo Telugu Movie Release Date : 'అనుకున్న రోజునే లియో రీలీజ్ అవుతుంది.. వారితో మాట్లాడి ప్లాన్ చేశాం' - లియో మూవీ నిర్మాత నాగ వంశీ
Published : Oct 17, 2023, 7:13 PM IST
Leo Telugu Movie Release Date : తమిళ నటుడు దళపతి విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లియో'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, తెలుగు వెర్షన్ విడుదలపై ఇటీవలే సందిగ్ధత నెలకొంది. టైటిల్ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్ వేయగా.. వాదనల తర్వాత హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విడుదలపై స్టే విధించింది. తెలుగులో ఈ సినిమాని అక్టోబరు 20 వరకు విడుదల చేయకూడదని ఆదేశించింది. దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన తాజాగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.
"లియో సినిమా టైటిల్ విషయంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అదే పేరుతో తెలుగులో వేరేవరో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. వారు మాకు సమాచారం ఇవ్వకుండానే నేరుగా కోర్టును ఆశ్రయించారు. మేం ఇరువురు చర్చించుకుని ఈ సినిమాని 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. విడుదల తేదీలో ఎుటవంటి మార్పు ఉండదు. టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయనకు, మాకూ నష్టం జరగకుండా చూసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్లుగానే థియేటర్ల సమస్య ఏం లేదు. 'లియో', బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇలా ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లు కావాలో అన్ని ఉన్నాయి" అంటూ నిర్మాత స్పష్టం చేశారు. దసరా పండగకు ముందే 'లియో' చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో జరగనున్న ప్రమోషన్స్‌లో పాల్గొంటారని తెలిపారు.