MLA Shekar Reddy Reaction On IT Raids : 'విదేశాల్లో నాకు మైనింగ్ వ్యాపారాలా.. అవాస్తవం..?' - తెలంగాణ ఎమ్మెల్యేల ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
MLA Shekar Reddy comments on IT Raids : హైదరాబాద్‌లో గత మూడ్రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులపాటు తనిఖీలు జరిపిన అధికారులు ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపి... వారి వ్యాపార లావాదేవీలనూ పరిశీలించారు. వారి నుంచి కీలకపత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని పైళ్ల శేఖర్‌రెడ్డి ఆరోపించారు. మొదటిరోజు గంటన్నరలోనే ఐటీ దాడులు పూర్తయ్యాయని..... అధికారులు కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని తెలిపారు. వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు అని అన్నారు. పాతికేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామన్న ఎమ్మెల్యే... విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయన్నది అవాస్తవమని వెల్లడించారు. ఐటీ అధికారులు నాకు నోటీసు ఇచ్చారని.... విచారణ కోసం ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధమని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నాకోసం మూడు రోజులుగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.