ఆస్కార్‌తో హైదరాబాద్ రాగానే చంద్రబోస్ ఏం చేశారో తెలుసా? - చంద్రబోస్ సురేశ్ బాబు
ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు అందుకొని హైదరాబాద్ తిరిగొచ్చిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ తన నిజాయతీని చాటుకున్నారు. 28 ఏళ్ల కింద తాను ఎక్కడైతే తొలి పాట రాశారో అక్కడికి ఆస్కార్ అవార్డును తీసుకెళ్లి ఆనందం వ్యక్తం చేశారు. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రంతో గేయ రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబోస్.. ఆ అవకాశాన్ని ఇచ్చిన దివంగత నిర్మాత రామానాయుడును గుర్తుచేసుకుంటూ ఆయన నిర్మించిన స్టూడియోలో అడుగుపెట్టారు. గ్లాస్ హౌజ్ లో తన తొలి పాట జ్ఞాపకాలను రామానాయుడు తనయుడు సురేష్ బాబుతో కలిసి గుర్తుచేసుకున్నారు. రామానాయుడు స్టూడియోలో మొదలైన తన ప్రయాణం ఆస్కార్ వరకు వెళ్లిందంటూ సంతోషాన్ని పంచుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తనకెంతో ప్రత్యేకమన్న చంద్రబోస్.... రామానాయుడు ఆశీస్సులు తనపై ఉంటాయని అభిప్రాయపడ్డారు. కాగా, 1995లో వచ్చిన 'తాజ్‌మహల్'తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు చంద్రబోస్. అందులో ఆయన రాసిన 'మంచు కొండల్లోన చంద్రమా' గీతం సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత చంద్రబోస్ ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో పాటలతో ఉర్రూతలూగించారు. కొన్నింటితో స్ఫూర్తినింపారు. ఎన్నో పద ప్రయోగాలు సృష్టించి, మెప్పించారు. ఇప్పుడు.. ఆస్కార్ పొందిన తొలి తెలుగు గేయ రచయితగా నిలిచారు.