పోలీసుల ముందే లాయర్ల డిష్యుం డిష్యుం
తమిళనాడు చెన్నై సమీపంలోని కొట్టూర్లో పోలీసుల ముందే న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వారు నివసించే కాలనీ రోడ్డు నిర్మాణ పనిలో తగాదా పడ్డారు. కొట్టూర్లోని నాయుడు కాలనీ రోడ్డు నిర్మాణ పనుల్లో లాయర్ పద్మనాభన్, థామస్ శ్రీనివాసన్ మధ్య వివాదం మొదలైంది. రోడ్డు నిర్మిస్తే తన ఇంటిలోకి వరద నీరు వస్తుందని పద్మనాభన్ ఆరోపించారు. ఈ వివాదంపై ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇటీవల వర్షం కారణంగా రోడ్డు మీద వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోడ్డు నిర్మాణాన్ని కాలనీవాసులతో కలిసి మొదలుపెట్టాడు శ్రీనివాసన్. అక్కడే గొడవకు దిగిన ఇరువర్గాలు.. కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లాయి. అక్కడ పోలీసుల ముందే బాహాబాహీకి దిగాయి. వీరి ఫైటింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.