బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం - సూరత్ బస్సు ప్రమాదంలో మహిళ సజీవ దహనం
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోరం జరిగింది. నగరంలోని వరచా ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అయ్యింది. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మంటలు చెలరేగిన సమయంలో బస్‌లో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని అనే లగ్జరీ బస్ సూరత్ నుంచి సౌరాష్ట్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్షణాల్లోనే అగ్ని కీలలు బస్సు అంతా వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు కొందరు అప్రమత్తమై వెంటనే కిందికి దిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరు మాత్రం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపారు.