స్టాలిన్ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రా విద్యార్థి - సీఎం స్టాలిన్ ఆంధ్రప్రదేశ్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టిని ఓ ఆంధ్రా విద్యార్థి ఆకర్షించాడు. స్టాలిన్ గురువారం ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి కారులో బయలుదేరారు. టీటీకే రోడ్డులో 'సీఎం సార్ హెల్ప్ మి' అనే ప్లకార్డు పట్టుకుని ఉన్న ఓ యువకుడు కనిపించాడు. వెంటనే కారు ఆపమని, యువకుడిని పిలిపించి స్టాలిన్ మాట్లాడారు. అతను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్.సతీశ్ అని తెలిసింది. నీట్‌ను వ్యతిరేకిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా ప్లకార్డు పట్టుకుని నిల్చొన్నానని యువకుడు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినా నీట్ కారణంగా వైద్యవిద్యకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎంబీబీఎస్ సీటు ఇప్పించాలంటూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశాడు. నీట్ రద్దుకు చట్టపరమైన పోరాటాలు జరుగుతున్నాయని ఆ విద్యార్థికి సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో గళం వినిపిస్తున్నట్టు కూడా తెలిపారు. నమ్మకంతో ఊరికి తిరిగి వెళ్లాలంటూ ఆ విద్యార్థికి సూచించారు.