పాకిస్థాన్‌లో పుట్టి.. పాక్ క్రికెట్ జట్టునే గడగడలాడించిన సికిందర్ రజా.. ఇప్పుడు జింబాబ్వేలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆల్‌రౌండర్. కీలకమైన పోరులో మూడు వికెట్లు తీసి పాక్‌పై సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. జింబాబ్వే మ్యాచ్ గెలిస్తే చాలు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు రజాదే. అంతలా జింబాబ్వే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సికిందర్ రజా.. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించేశాడు. మరి ఆ రికార్డు ఏంటి.. అతడి ప్రస్థానం ఎలా ప్రారంభమైందో కూడా తెలుసుకోండి.
పాకిస్థాన్‌లోని పంజాబ్ సియాల్‌కోట్‌లో 1986లో జన్మించిన సికిందర్ రజా.. అక్కడి ఎయిర్‌ఫోర్స్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. అయితే 2002లో అతడి కుటుంబం జింబాబ్వేకి వలస వచ్చేసింది. దేశీయ పోటీల్లో అత్యద్భుత ప్రదర్శనతో జింబాబ్వే జాతీయ క్రికెట్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2013లో జాతీయ జట్టుకు ఎంపికైన సికందర్ రజా ఇప్పటి వరకు 17 టెస్టులు, 123 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.
కోహ్లీని ఎలా అధిగమించాడంటే..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జింబాబ్వే నాలుగు మ్యాచ్‌లను ఆడింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అర్హత మ్యాచుల్లో మూడు.. సూపర్-12 దశలో ఒక దాంట్లో తలపడింది. మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌ను ఓడింది. గెలిచిన అన్ని మ్యాచుల్లో 'ప్లేయర్ ఆఫ్ మ్యాచ్' విన్నర్‌గా సికిందర్ రజా రికార్డు సృష్టించాడు. ఇలా ఒకే ప్రపంచకప్‌లో మూడుసార్లు ఇలాంటి అవార్డు అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లీ 2016 పొట్టి కప్‌లో రెండుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్‌లో విరాట్ 6 అవార్డులను అందుకోగా.. సికిందర్ రజా ఇప్పటికే ఏడింటిని సొంతం చేసుకొని మరో రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో విరాట్ కూడా ఒక అవార్డు అందుకొన్నాడు. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఈసారి వీరిద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉంది.